కలం, మహబూబ్ నగర్ బ్యూరో : గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే జిల్లా స్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గణప సముద్రం రిజర్వాయర్ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రిజర్వాయర్ పరిధిలోని 164 ఎకరాల భూముల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారుల ముందు వెల్లడించారు. గణప సముద్రం రిజర్వాయర్ (Ganapa Samudram Reservoir) నిర్మాణంలో సేకరించనున్న 164 ఎకరాలకు సంబంధించి భూములు చాలా విలువైనవని, ఈ భూములు తమ గ్రామ రైతులకు ఎంతో ముఖ్యమని, విలువైన పంటలు పండుతాయని తమ గోడును ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ భూములపై పూర్తిస్థాయిలో స్టడీ చేసి పరిహారం విషయంలో రైతులకు న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. తామంతా కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే తమకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలు పండక వలసలు వెళ్లిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు కొంత నీటి సౌకర్యం ఏర్పడి పంటలు బాగా పండుతున్నాయని, ఈ సమయంలో భూసేకరణ పేరుతో తమకు అన్యాయం చేయవద్దని కోరారు.
ప్రభుత్వం తమకు ఎకరానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా, పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గణపసముద్రం రిజర్వాయర్ భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోనున్న రైతుల అభిప్రాయ సేకరణ కోసమే ఈ జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేట్ల కు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందని తెలిపారు. రైతులు ఎవరూ కంగారు పడవద్దని, రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు.
సాటిల్ బండ్ విషయంలో సీఈ ల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఎంత ఇవ్వవచ్చు అనేది త్వరలోనే నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే గ్రామానికి అధికారులు వచ్చి పరిహారం గురించి చెప్పడం జరుగుతుందని తెలియజేశారు. రైతుల విన్నపాన్ని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, నాయకులు సాయి చరణ్ రెడ్డి, సర్పంచి, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్, ఇతర రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

