Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసియా గేమ్స్ వివాదం.. లీగల్ యాక్షన్‌కు మనికా బాత్రా

కలం, వెబ్ డెస్క్ : ఆసియా గేమ్స్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా (Manika Batra) మరోసారి తీవ్రంగా స్పందించింది. తనకు ప్రత్యేక అవకాశం కావాలని అడగడం లేదని, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన సమాధానాలు మాత్రమే కోరుతున్నానని పేర్కొంది. సరైన వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆసియా గేమ్స్ ఎంపికకు సంబంధించి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రమాణాలను తాను అందుకోలేదనే కారణంతో మనికాను జట్టులోకి ఎంపిక చేయలేదు.

ముఖ్యంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారింది. అయితే తనను ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని మనికా పేర్కొంది. ప్రస్తుతం తాను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్నానని, ర్యాంకింగ్స్ ప్రతి వారం మారుతుంటాయని గుర్తు చేసింది. ఎంపిక సమయంలో ఏ కాలపరిమితిని పరిగణనలోకి తీసుకున్నారో వివరించాలని కోరింది.

జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేదనే విమర్శలపై కూడా ఆమె స్పందించింది. అంతర్జాతీయ టోర్నీలతో బిజీ షెడ్యూల్, ప్రయాణాలు, వీసా ప్రక్రియలు, శారీరక పునరుద్ధరణ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అయినప్పటికీ భవిష్యత్తులో జాతీయ పోటీల్లో మరింతగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. ఈ సీజన్‌లో తాను అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించానని మనికా గుర్తు చేసింది.

ఆసియా దేశాల ఆటగాళ్లు, బలమైన చైనా ప్రత్యర్థులపై సాధించిన విజయాలను కూడా ఎంపిక కమిటీ పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడింది. తనతో పాటు గత ఆసియా గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో పతకం సాధించిన అయికా ముఖర్జీ వంటి క్రీడాకారిణులు కూడా జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. దీంతో ఎంపిక ప్రమాణాలపై మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయని చెప్పింది.

ఎంపిక ప్రక్రియ ఓటింగ్ ఆధారంగా జరిగిందనే సమాచారం తనకు అందిందని, అది నిజమైతే ఎవరు ఓటు వేశారో, ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఎంపిక కమిటీ సభ్యుల అర్హతలు, అంతర్జాతీయ అనుభవం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయా జోక్యం చేసుకోవాలని మనికా మరోసారి కోరింది. తనకు జట్టులో చోటు కావాలని కాదు, ప్రతి క్రీడాకారుడికి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>