కలం, వెబ్ డెస్క్: ఇటీవల వచ్చిన భారీ భూకంపాన్ని మర్చిపోకముందే జపాన్ (Japan)ను మరో భూకంపం (Earthquake) వణికించింది. జపాన్‌లోని ఈశాన్య తోహోకు తీరంలో గురువారం తెల్లవారుజామున భారీ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. ఐవాలే తీర ప్రాంతంలో భూమికి దాదాపు 50 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపంతో సముద్ర మట్టాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది అంత పెద్ద ప్రమాదకరమేమీ కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత దాటినప్పుడు మనుషులు నేలపై నడవలేరు, కేవలం పాకుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తోహోకు షింన్సెస్ హై-స్పీడ్ రైలు సర్వీసులతో పాటు పలు రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ జపాన్ రైల్వే తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో జపాన్ ఒకటి. అక్కడ భూకంపాలు సర్వ సాధారణం. కానీ, అధికంగా నష్టం జరిగేలా రావడం అరుదు. భూకంపం వచ్చినంత సేపు ప్రజలు కాసేపు పనులన్నీ ఆపేసి, పరిస్థితి సాధారణంగా మారగానే యథావిధిగా తమ పనులు చేసుకుంటారు.
మరోవైపు వెనిజువెలా (Venezuela) ఉత్తర తీర ప్రాంతంలో ఒకే నిమిషం వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 వీటి తీవ్రత నమోదైంది. రాజధాని కరాకస్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో ఈ భూకంపాల ధాటికి భారీ భవనాలు కుప్పకూలాయి. మరికొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధాన విమానాశ్రయమైన సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం ఈ ప్రకంపనల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. భూకంపం రావడంతో భయాందోళనలకు గురైన వేలాది మంది ప్రజలు ఇళ్లను విడిచి వీధుల్లోకి పరుగులు తీశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సిగ్నళ్లు నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. వెనిజువెలాలో ఇలాంటి భారీ భూకంపాలు సంభవించడం చాలా అరుదు.

