కలం, స్పోర్ట్స్: 2036 ఒలింపిక్స్ (Olympic) ఆతిథ్య హక్కులను దక్కించుకోవాలన్న భారత్ ఆశలకు కీలక ముందడుగు పడింది. ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే కొత్త విధానానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలపడంతో, తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్న విషయంపై స్పష్టత వచ్చింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాన్ని 2029 మధ్యలో ప్రకటించనున్నట్లు ఐఓసీ వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో జరిగిన ఐఓసీ 146వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్ ఆతిథ్య దేశాల ఎంపిక కమిషన్ చైర్‌పర్సన్ కొలిండా గ్రాబర్-కిటరోవిచ్ ప్రతిపాదించిన కొత్త విధానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, పోటీలో ఉన్న దేశాలకు మరింత స్పష్టత ఇవ్వడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్ (Olympic) నిర్వహణకు భారత్ ఇప్పటికే అధికారికంగా ఆసక్తి వ్యక్తం చేసింది. 2024లో తన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించిన భారత్ ప్రస్తుతం ఐఓసీ నిర్వహిస్తున్న కంటిన్యూయస్ డైలాగ్ దశలో ఉంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించింది. కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న కంటిన్యూయస్ డైలాగ్ దశ అనంతరం 2027 మార్చిలో షార్ట్‌లిస్ట్ ప్రకటిస్తారు. ఎంపికైన దేశాలు “స్ట్రాటజిక్ డైలాగ్” దశలోకి ప్రవేశిస్తాయి. ఈ దశలో ఐఓసీ ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక హామీలు సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుల నియంత్రణ, మౌలిక వసతులు, ప్రాజెక్టు అమలు కాలపట్టిక వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు.
అదే సమయంలో ఐఓసీ ప్రతినిధులు ఆయా దేశాల్లోని ప్రతిపాదిత వేదికలను సందర్శించి పరిస్థితులను అంచనా వేస్తారు. ఆ తర్వాత 2028లో జరిగే “టార్గెటెడ్ డైలాగ్” దశకు అర్హత సాధించిన దేశాలు తుది పోటీలో నిలుస్తాయి. ఈ దశ పూర్తయ్యాక ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రాధాన్య ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసి, తుది ఆమోదం కోసం ఐఓసీ సమావేశం ముందుంచుతుంది. అనంతరం 2029 మధ్యలో జరిగే సమావేశంలో 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
భారత్‌కు ఈ రేసులో ఖతార్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. టర్కీ, దక్షిణాఫ్రికా కూడా పోటీలో ఉండే దేశాలుగా భావిస్తున్నారు. ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల ఎంపిక ప్రక్రియను గత ఏడాది తాత్కాలికంగా నిలిపివేసిన ఐఓసీ, సభ్య దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది. దీంతో 2036 ఒలింపిక్స్ కలను సాకారం చేసుకోవాలన్న భారత్ ప్రయత్నాలకు మరింత స్పష్టమైన రోడ్‌మ్యాప్ లభించినట్లైంది.

