కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత మనందరి బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వాటర్స్ ప్రాథమిక పాఠశాలలో శనివారం “మన బడి.. స్వచ్చ బడి” (Mana Badi Swachh Badi) కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజలతో కలిసి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తరగతి గదుల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థుల చదువుల ఆలయాలు పరిశుభ్రంగా ఉంటే వారి దృష్టి చదువు పై కేంద్రీకృతమై, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న గొప్ప సంకల్పంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలలో చెత్తా చెదారం తొలగించి పరిశుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీసుకున్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పండగ వాతావరణం నెలకొందన్నారు. గత రెండు నెలలుగా వేసవి సెలవుల కారణంగా పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడిందని, సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకే మంత్రి సంజయ్ కుమార్ ఇచ్చిన స్పూర్తితో మన బడి… స్వచ్చ బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
నాణ్యమైన విద్యను అభ్యసించి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ప్రత్యేక చర్యలతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పిలుపు నిచ్చారు. విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య లభించడాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని పిలుపు నిచ్చారు. ఎన్నో పోటీ పరీక్షలు రాసి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారు కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి భవిష్యత్తును ఇప్పించాలని పిలుపు నిచ్చారు.
భావితరంలో పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను, ప్రతిభావంతమైన క్రీడలను అందిస్తున్నామని తెలిపారు. ఆ సౌకర్యాలను వినియోగించుకునేలా చేసి మీ పిల్లలను మానసికంగా, శారీరకంగా ఎదిగేలా తల్లిదండ్రులు తగిన చర్యలు తీస్కోవాలన్నారు. జూన్ 16 నుండి బడి బాటలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ.. విద్యార్థులు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధుల కింద దాదాపు రూ.14 కోట్లతో పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్‌లను, మరో రూ.10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించినట్లు గుర్తుచేశారు. స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేయించి నగరంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేసి, గొప్ప సంకల్పంతో “మన బడి.. స్వచ్చ బడి” కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో (Mana Badi Swachh Badi) బీజేపీ నాయకులు ఉపేందర్, కుంభం అనిల్, నరేంధర్, బాలు, హామీద్, కన్నం శ్రీనివాస్, రాజ్ ప్రభాకర్, రమేష్ గౌడ్, వెంకట్ రావు, పండగ నాగరాజు, అనుదీప్, విష్ణు, రోహిత్, మహేందర్, రమేష్, బాలు, నరేంధర్, చైతన్య యూత్ క్లబ్, ఆదర్శ యూత్ క్లబ్, మహదేవ యూత్, జైభూన్ యూత్ క్లబ్ ల సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: వెదర్ ఎఫెక్ట్: శంషాబాద్‌లో ల్యాండింగ్‌కు నో పర్మిషన్!
Follow Us On: Instagram

