కలం, మెదక్ బ్యూరో : వెల్దుర్తి (Veldurthi) మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి రామానుజం (40)పై అదే గ్రామానికి చెందిన గుండెని ప్రవీణ్ కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సెలోఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతోనే రామానుజంపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం గ్రామంలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్ తో పాటు మరికొందరు రాత్రి సమయంలో రామానుజం ఇంటి వద్దకు వెళ్లారు.
అనంతరం కర్రలతో రామానుజంపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామానుజం అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ప్రవీణ్ తన సెల్ ఫోన్ పోయిందంటూ వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ సెల్ ఫోన్ అనంతరం దొరికినట్లు తెలిసింది. అయినప్పటికీ సెల్ ఫోన్ రామానుజమే దొంగతనం చేశాడనే అనుమానంతో అతడిపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన వెనుక పాత కక్షలు కూడా ఉన్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా హత్యకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెల్దుర్తి (Veldurthi) ఎస్ఐ కరుణాకర్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు రామానుజానికి భార్య రజితతో పాటు తల్లిదండ్రులు సాయిలు, పోచమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Also Read : నీరు ధండా జోరు.. రెండు గోల్డ్స్, సిల్వర్
Follow Us On: X(Twitter)

