కలం, వెబ్ డెస్క్: కరీంనగర్‌లోని (Karimnagar) ఓప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించిన వృద్ధుడు అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
చందుర్తి (Chandurthi) మండలం సనుగుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన కుటుంబ సభ్యులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. తండ్రి మృతి వార్త విని గల్ఫ్ నుంచి స్వగ్రామానికి బయల్దేరిన కుమారులకు ఈ విషయం ఊరటనిచ్చింది.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స
చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య (Cheekati Shankaraiah) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అంత్యక్రియలకు తరలిస్తుండగా..
శంకరయ్య మృతి చెందినట్లు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామమైన సనుగులకు తరలిస్తున్నారు. జోగాపూర్ సమీపంలోకి చేరుకున్న సమయంలో అంబులెన్స్‌లో ఉన్న శంకరయ్య అకస్మాత్తుగా కదిలి లేచి కూర్చున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే అంబులెన్స్‌ను వేములవాడ వైపు మళ్లించారు.
వేములవాడ ఆస్పత్రిలో పరీక్షలు
శంకరయ్యను హుటాహుటిన వేములవాడలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనను పరీక్షించగా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో శంకరయ్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కుటుంబంలో ఆనందం.. గ్రామంలో ఆసక్తి
తండ్రి మృతి చెందారన్న సమాచారంతో గల్ఫ్‌లో ఉన్న శంకరయ్య కుమారులు స్వగ్రామానికి బయల్దేరారు. అయితే ఆయన బతికే ఉన్నారన్న విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సనుగుల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో శంకరయ్యను చూసేందుకు ఆస్పత్రికి తరలివచ్చారు. మృతి చెందినట్లు భావించిన వ్యక్తి తిరిగి లేచి కూర్చోవడంతో ఈ ఘటన చందుర్తి మండలంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : గులాబీ మయమైన నెక్లెస్ రోడ్: క్యాన్సర్‌పై పోరులో ‘ పింక్ పవర్’ రన్!
Follow Us On: X(Twitter)

