కలం వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) తనకల్లు(Tanakallu)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్(police station) ముందే నరికి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. మార్పురివాండడ్లపల్లికి చెందిన ఈశ్వరప్పకు రాగినేపల్లికి చెందిన హరి భార్యతో వివాహేతర సంబంధం ఉంది. నాలుగు రోజుల క్రితం ఈశ్వరప్ప, హరి భార్యను తీసుకెళ్లాడు. దీంతో హరి తనకల్లు పోలీస్ స్టేషన్‌లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈశ్వరప్ప ఆచూకీ కనుక్కొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈశ్వరప్ప పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఈశ్వరప్ప కోసం స్టేషన్ బయటే కాపు కాచుకొని కూర్చున్న హరి ఒక్కసారిగా వేట కొడవలితో దాడి చేశాడు. దీంతో ఈశ్వరప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ హత్యకు తనకల్లు పోలీస్ స్టేషన్‌లోని ఓ హెడ్ కానిస్టేబుల్ సహకరించాడని ఈశ్వరప్ప కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల సహకారం, నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


