పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం..?

కలం, నకిరేకల్ : రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలను పరిష్కరించాల్సింది పోయి, పోలీసుల అత్యుత్సాహం, వేధింపులు ఒక యువకుడి ప్రాణం మీదకు తెచ్చాయి. పోలీసుల ముందే యువకుడు పురుగుల మందు తాగినా.. కాపాడాల్సింది పోయి వీడియోలు తీస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కదిరే సతీష్, అతని భార్య ఉప్పమ్మల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉప్పమ్మ నకిరేకల్ (Nakrekal) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు సతీష్‌ను స్టేషన్‌కు పిలిపించారు.

కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు సతీష్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, బెదిరింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన సతీష్, పోలీసుల ముందే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడని బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సతీష్ మందు డబ్బా పట్టుకుని, తాను మందు తాగానని మొరపెట్టుకుంటున్నా పోలీసులు స్పందించలేదు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సింది పోయి.. పోలీసులు తమ ఫోన్లతో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారని బాధితులు ఆరోపిస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమించడంతో, ఆ తర్వాత పోలీసులు అతడిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. “న్యాయం చేయాల్సిన పోలీసులే నా కొడుకు ఆత్మహత్యకు కారణమయ్యారు” అని సతీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>