కలం, వెబ్ డెస్క్ : లక్నోతో జరుగుతున్న మ్యాచ్ (PBKS vs LSG)లో పంజాబ్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఐపీఎల్ 2026 టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన టీమ్‌గా పంజాబ్ నిలిచింది. మొన్నటి వరకు 250 పరుగులతో పంజాబ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్‌తో పంజాబ్ దానిని అధిగమించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ గోల్డెన్ డకౌట్ అయినా.. కనోలీ, ప్రియాన్ష్ ఇద్దరూ పరుగుల వరద పారించారు. వారి దెబ్బకు లక్నో బౌలర్లు బెంబేలెత్తారు. వారిద్దరే 180 పరుగుల భాగస్వామ్యంలో అద్భుతమైన స్కోర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బౌండ్రీలు బాదడంపైనే ఫోకస్ పెట్టారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెపటెన్ శ్రేయాస్ అయ్యర్ ఆశించిన పర్వార్మెన్స్ రాకపోయినా.. మిగిలిన బ్యాటర్లు దానిని కవర్ చేసేశారు. భయమో, కంగారో తెలియదు కానీ.. 18వ ఓవర్ వేసిన షమీ.. వరుస వైడ్‌లతో ఆ ఒక్క ఓవర్లోనే 20 పరుగులు ఇచ్చాడు. దీంతో లక్నో ముందు 255 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. చివరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించడంతో లక్నో ముందు హిమాలయమంత లక్ష్యం నిలిచింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 37 బంతుల్లోనే 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు సాధించి సెంచరీ చేజార్చుకున్నాడు. అతనికి జతగా కూపర్ కనోలీ 46 బంతుల్లో 87 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి రన్ రేట్‌ను పరుగులెత్తించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 5 పరుగులకే నిరాశపరిచినా, మిడిల్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి రన్ అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ సింగ్ 6 బంతుల్లోనే 2 సిక్సర్లతో 17 పరుగులు జోడించగా, నేహల్ వధేరా 13 పరుగులు చేసి సిద్ధార్థ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 9 పరుగులు రావడంతో స్కోరు 254కు చేరింది.
లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. మణిమారన్ సిద్ధార్థ్ 3 ఓవర్లలో 35 పరుగులిచ్చి ప్రియాన్ష్, వధేరా వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, అందులో 5 వైడ్లు ఉండటం గమనార్హం. మొహ్సిన్ ఖాన్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి శ్రేయాస్ అయ్యర్ వికెట్ సాధించాడు. ఇతర బౌలర్లలో ఆవేష్ ఖాన్ 3 ఓవర్లలో 46 పరుగులు, ఐడెన్ మార్క్రామ్ ఒకే ఓవర్లో 32 పరుగులు సమర్పించుకున్నారు. ఆయుష్ బదోని తన ఏకైక ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు ఎకానమీ రేట్లను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

