కలం, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయంలో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపెంపును దాచిపెట్టిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఎక్స్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఒక వేళ ఎన్నికలకు ముందే ఈ ధరలను పెంచి ఉంటే బీజేపీకి భారీ నష్టం వాటిల్లేదని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలను మోసం చేస్తూ అన్ని విషయాలను దాచిన మోదీ ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై ధరల భారాన్ని మోపిందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి భవిష్యత్తుపై ఎలాంటి ముందుచూపు లేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నిరంతరాయంగా కొనసాగుతోందని అన్నారు. దీని వల్ల దేశంలోని పేద ప్రజలకు అందాల్సిన కనీస నిత్యావసర వస్తువులు కూడా దక్కకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద గొంతుకగా నిలిచి, పెరుగుతున్న ఈ ద్రవ్యోల్బణ సమస్యపై కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు.

