రైస్ మిల్లుల్లో సన్న వడ్లు మాయం..!

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి తిష్టవేసిందా? పేదలకు అందాల్సిన సన్న బియ్యం దారిమళ్లుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) పేరుతో ఉమ్మడి జిల్లాల్లో అధికారుల అండదండలతో మిల్లర్లు సాగిస్తున్న ‘సన్న’ వడ్ల మాయాజాలం వల్ల పౌరసరఫరాల సంస్థకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సమాచారం. “సన్న బియ్యం” పథకం అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లా పరిధిలోని పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు, కేటుగాళ్లైన రైస్ మిల్లర్లు కుమ్మక్కై సాగిస్తున్న ఈ దారిమల్లింపు దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే లక్ష టన్నుల సన్న బియ్యం దారిమళ్లగా కోట్ల రూపాయ‌ల‌ స్కామ్‌ (Scam) జరిగినట్లు తెలుస్తోంది.

రైతుకు ప్రోత్సాహం.. మిల్లర్లకు ‘పండగ’

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే సదుద్దేశంతో, రైతులను ప్రోత్సహించేందుకు సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తోంది. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఈ పథకాన్ని తమ స్వలాభానికి వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి మరీ సేకరించిన అత్యంత నాణ్యమైన సన్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ (CMR) కోసం రైస్ మిల్లులకు (Rice Mills) పంపుతారు. మిల్లర్లు ఈ సన్న ధాన్యాన్ని మిల్లుల్లోనే గట్టుచప్పుడు కాకుండా బహిరంగ మార్కెట్‌కు, పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు క్వింటాలుకు రూ.3,500 వరకు విక్రయించుకుంటున్నారు. ఇదంతా సంబంధిత అధికారుల తెలిసే జరుగుతుండటం విశేషం.

నాసిరకం బియ్యం రీ-సైక్లింగ్

సన్న వడ్లు (ధాన్యం) అమ్మకం ద్వారా వచ్చిన అపారమైన సొమ్ముతో పొరుగు రాష్ట్రాల నుంచి అతి తక్కువ ధరకు లభించే దొడ్డు, నాసిరకం బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆ తక్కువ రకం బియ్యాన్నే ప్రభుత్వం ఇచ్చిన సన్న ధాన్యానికి బదులుగా సీఎంఆర్ కింద పౌరసరఫరాల శాఖకు డిపాజిట్ చేసి రికార్డులు సరిచేస్తున్నారు. అటు సివిల్ సప్లై అదికారులను ఇటు ఎఫ్‌సీఐని బోల్తా కొట్టించిన మిలర్లు దండిగా దండుకుంటూ ప్రభుత్వానికి పంగనామం పెడుతున్నారు. ఇవన్నీ జిల్లా స్థాయిలో అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కోట్లు సంపాదిస్తున్న మిల్లర్లు అథికారులకు తమ వాటాలు అప్పజెప్పుతున్నారని తెలుస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారుల మధ్య‌ సమన్వయం లేకపోయినా మూటలు మాత్రం ముడుతున్నాయనేది సమాచారం. పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) అధికారులు, ఉద్యోగులే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యంగా చర్చించుకుంటున్నారు.

లారీకి లక్షల్లో అక్రమ ఆర్జన

ఈ రీ-సైక్లింగ్ మాయాజాలం వల్ల ఒక్కో లారీ (ఏసీకె- 435 క్వింటాళ్లు) ధాన్యం/బియ్యం పై మిల్లర్లకు రూ. 2.15 లక్షల వరకు అక్రమ లాభం దక్కుతోంది. మరోవైపు నాణ్యమైన సన్న ధాన్యాన్ని కోల్పోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఒక్కో లారీపై దాదాపు రూ. 2,17,500 నికర నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు పూర్తిగా మాయమైనట్లే తెలుస్తోంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 21 వేల మెట్రిక్ టన్నులు రూ. 20 కోట్ల విలువైన బియ్యం మాయమయ్యాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో గత రెండు సీజన్లకు సంబంధించి దాదాపు లక్ష టన్నులు రూ.వంద కోట్ల విలువైన స్కామ్‌ జరిగిందని సమాచారం. ఒక్కొక్క ఎఫ్‌సీఐ ఏరియాకి రూ.15 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లు పక్కదారి పడుతున్నాయి.

అధికారులు.. మిల్లర్ల ‘సిండికేట్’

ఈ దందా ఏళ్ల తరబడి అడ్డూఅదుపు లేకుండా సాగడానికి పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉన్నతాధికారులు, కిందిస్థాయి ఇన్‌స్పెక్టర్లు, డిపో మేనేజర్ల తోడ్పాటే కారణమనే ఆరోపణలున్నాయి. ప్రతి నెలా మిల్లుల్లో ధాన్యం నిల్వలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటుపడి ఖాళీ గోదాముల్లో కూడా నిల్వ ఉన్నట్లు కాగితాలపై రికార్డు రాస్తున్నారు. ఒక్కో లారీ రీ-సైక్లింగ్ బియ్యాన్నిఎఫ్ సి ఐ ,సివిల్ సప్లైస్ గొదాముల్లో అన్-లోడ్ చేయించడానికి రూ.10,000 నుంచి రూ.15,000 వరకు లంచాల రూపంలో చేతులు మారుతున్నట్లు సమాచారం. సిండికేట్ పుణ్యమా అని ప్రజాధనం లూటీ చేస్తూ పేదలకు తిరిగి దొడ్డు బియ్యమే దక్కుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రైతుల కష్టార్జితం వ్యాపారుల పాలు కాగా మరోవైపు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల గండి పడుతోంది.

సిట్ విచారణ జరిపించాలి: కాచం శ్రీనివాస్, సామాజిక కార్యకర్త

“ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కొందరు అధికారులు సిండికేట్‌గా మారి ఈ దందాను నడుపుతున్నారు. పౌరసరఫరాల శాఖను వెంటనే ప్రక్షాళన చేసి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా ‘సిట్’ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులను సీజ్ చేసి వారి ఆస్తులను జప్తు చేయాలి.”

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>