కలం, దమ్మ పేట : “రైతు వద్ద కొనుగోలు చేశాను కదా నాకేం కాదనుకుంటే” పొరపాటే. సరైన చట్టబద్ధమైన పత్రాలు, అటవీ శాఖ అనుమతులు లేకుండా కొనుగోలు చేసినా, నిల్వ ఉంచినా అది అక్రమ అటవీ నేరమే అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అంకంపాలెం బీట్లో భారీగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.7.05 లక్షల విలువైన టేకు కలపను అటవీ శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 24×7 కమాండ్ కంట్రోల్ సెంటర్కు అంకంపాలెం బీట్లో కలప అక్రమ నిల్వపై సమాచారం అందడంతో అధికారులు వెంటనే స్పందించారు. సమాచారం వచ్చిన 24 గంటల్లోనే టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ నేతృత్వంలో దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు క్షేత్రస్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా దాచిన 57 టేకు రౌండ్ దుంగలు, 44 టేకు సాన్ సైజులను గుర్తించారు. మొత్తంగా 5.235 క్యూబిక్ మీటర్ల కలపను స్వాధీనం చేసుకుని, దమ్మపేట రేంజ్ అధికారి సమక్షంలో అంకంపాలెం బీట్ అధికారి ఏ. పార్వతి సురక్షిత కస్టడీకి అప్పగించారు.
విచారణలో నిందితుడు తాను ఈ కలపను ఒక రైతు వద్ద కొనుగోలు చేసినట్లు తెలుపగా, ముందస్తు అనుమతులు లేకపోతే రైతు నుంచి కొన్నా సరే అది చట్టబద్ధమైన కలపగా మారదని అధికారులు తేల్చిచెప్పారు. కలప కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన మూలం, రవాణా పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అడవుల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అక్రమ కలపపై సమాచారం ఉన్నవారు అటవీ శాఖకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, దమ్మపేట ఎఫ్ఆర్ఓ శ్రీనుతో పాటు సెక్షన్ అధికారులు లోకనాథం, ప్రసాద లింగం, బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

