బోరు ఎండింది.. నల్లా నీరే దిక్కైంది..!

కలం, దిలావర్‌పూర్ : ఓ వైపు వర్షాభావం.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతు పడుతున్న కష్టం ఇది. సాధారణంగా వ్యవసాయ క్షేత్రాలకు బోర్లు, బావుల నుంచి నీరు చేరుతుంది. కానీ వర్షాలు సరిగా కురవక బోరు బావులు ఎండిపోవడంతో గ్రామంలోని నల్లా నీటినే పొలానికి తరలిస్తూ పంటను కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం మాడేగాం గ్రామానికి చెందిన ఓ రైతు (Madegaon Farmer) సుమారు మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాడు. పంటకు కీలకమైన సమయంలో వర్షాలు ముఖం చాటేయడంతో పంట చేనులోని బోరులో నీరు అడుగంటిపోయింది. దీంతో చేసేదేమీ లేక గ్రామంలోని నల్లా నుంచి నీటిని డ్రమ్ముల్లో నింపి ఎడ్లబండిపై వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నాడు.

ప్రతి రోజూ డ్రమ్ములతో నీరు

పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న పట్టుదలతో రైతు ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు డ్రమ్ముల నీటిని గ్రామం నుంచి పొలానికి తీసుకెళ్తున్నాడు. నల్లా నీటిని పంట చేనుకు తరలించి, అందులో రసాయన మందులు కలిపి పత్తి పంటపై పిచికారీ చేస్తున్నట్లు రైతు తెలిపాడు. నీటి కోసం ప్రతిరోజూ ఎడ్లబండిపై చేసే ఈ ప్రయాణం తనకు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

చేతికొచ్చే వేళ.. నీటి కష్టాలు

వర్షాకాలంలో అడపాదడపా కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం వర్షాభావం కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. పత్తి పంట చేతికొచ్చే సమయంలో తగినంత తేమ లేకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను సాగు చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని చివరి వరకు కాపాడుకోవడం మరో ఎత్తుగా మారింది. మాడేగాంలో కనిపించిన ఈ దృశ్యం.. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు అద్దం పడుతోంది. వాన కోసం ఆకాశం వైపు చూస్తూనే.. పంటను కాపాడుకునేందుకు నల్లా నీటిని ఎడ్లబండిపై పొలానికి తరలిస్తున్న రైతు పరిస్థితి అందరినీ ఆలోచింపజేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>