కలం, వెబ్‌డెస్క్: బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెను మార్పు చోటు చేసుకుంది. తాజాగా బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) కొత్త క్యాలెండర్ (Badminton Calendar)ను ప్రకటించింది. 2027, 2028 సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం 35 టోర్నమెంట్లు జరగనున్నాయి. ఇందులో సూపర్ 1000 నుండి సూపర్ 100 స్థాయి మ్యాచ్‌లు ఉంటాయి. వరల్డ్ టూర్ ఫైనల్స్ కూడా ఇందులో భాగమే.భారత్‌లో జరిగే ఇండియా ఓపెన్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. సాధారణంగా జనవరిలో జరిగే ఈ టోర్నీ ఇకపై ఫిబ్రవరిలో జరుగుతుంది.
2027లో ఫిబ్రవరి 2 నుండి 7 వరకు ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అలాగే 2028లో జనవరి 25 నుండి 30 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో కూడా మార్పు వచ్చింది. ఈ టోర్నమెంట్ స్థాయిని సూపర్ 300 నుండి సూపర్ 100కు తగ్గించారు. దీని నిర్వహణ సమయం కూడా మారింది. నవంబర్‌కు బదులుగా ఈ టోర్నీ జూలైలో జరుగుతుంది. 2027లో జూలై 27 నుండి ఆగస్టు 1 వరకు ఈ పోటీలు ఉంటాయి. అలాగే 2028లో జూలై 25 నుండి 30 వరకు నిర్వహిస్తారు.
ఈ కొత్త క్యాలెండర్‌తో పాటు సరికొత్త స్కోరింగ్ విధానాన్ని తెస్తున్నారు. 2027 జనవరి 4 నుండి అన్ని బిడబ్ల్యూఎఫ్ మ్యాచ్‌లలో $3×15$ స్కోరింగ్ రూల్ అమలు అవుతుంది. టోర్నమెంట్ల మధ్య ఆటగాళ్లకు తగిన విశ్రాంతి దొరకడానికే ఈ మార్పులు చేసినట్లు బిడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖున్యీంగ్ పటామ లీస్వాద్‌ట్రాకుల్ తెలిపారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అర్హత పోటీలు 2027 మే 3 నుండి 2028 ఏప్రిల్ 30 వరకు జరుగుతాయి. అయితే సుదిర్మాన్ కప్, థామస్ కప్, ఉబెర్ కప్ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

