కలం, సినిమా బ్యూరో: చక్రి (Music Director Chakri).. ఆ పేరు వినగానే ‘‘జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది’’, ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా”, ‘‘నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా”ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల పాటలు గుర్తుకువస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కంబాలపల్లిలో పుట్టి పెరిగి తెలుగు సినీ పరిశ్రమను తన సంగీత ప్రపంచంతో ఓలలాడించిన తెలంగాణ బిడ్డ చక్రి.
స్వరాష్ట్రం కోసం యావత్ తెలంగాణ ఉద్యమించిన వేళ.. ఏ ఒక్క సినీ పెద్ద ముందుకు రాని సమయంలో.. నేనున్నాంటూ తన సంగీతంతో చక్రి స్వరం కలిపారు.. కదం తొక్కారు. ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు సంగీతం అందించి పురిటిగడ్డ రుణం తీర్చుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌తో దగ్గరుండి ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాటను పాడించారు. మలిదశ ఉద్యమానికి ఆ పాట ఊపిరులూదింది. శతాధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి.. 40ఏండ్లకే కాలం చేశారు. నేడు ఆయన జయంతి.
ఇప్పటికీ ఆ కొడుకు జ్ఞాపకాల చుట్టూ అమ్మ తిరుగుతున్నది. కేవలం తన కోసమే కొడుకు పాడిన ‘‘నీవే నీవే నీవే నేనంటా..’’ పాటను రోజుకు పదిసార్లు వింటూ ఆ తల్లి కాలం గడుపుతుంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న చక్రి తల్లి విద్యావతిని ‘కలం’ పలకరించింది. ఆ అమ్మ నుంచి మొదట వచ్చిన మాట.. “నా కొడుకు ఎవరికైనా గుర్తున్నాడా బిడ్డా..’’!! ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువన దాచుకుంటూ చక్రి జ్ఞాపకాల్లోకి వెళ్లింది విద్యావతి. ఏ స్వరాష్ట్రం కోసమైతే తన కుమారుడు పాటలు అందించాడో.. ఆ స్వరాష్ట్రంలో ఆ బిడ్డకు కనీసం గుర్తింపు దక్కడం లేదని, తాను కన్నుమూసేలోపైనా ఆ కోరిక నెరవేరుతుందో లేదోనని ఆ తల్లి ఎదురుచూస్తున్నది. ఆ అమ్మ ఏమంటున్నదంటే.. ఆమె మాటల్లోనే..!
సంగీతమే వాడి ప్రపంచం
‘‘నాకు ఐదుగురు పిల్లలు. మొదట ఇద్దరు అమ్మాయి. మూడో సంతానం చక్రి. తర్వాత అమ్మాయి, ఆ తర్వాత మరో కొడుకు. మా ఆయన వెంకట నారాయణ.. టీచర్. చక్రికి చిన్నప్పటి నుంచి సంగీతమే ప్రపంచం. దాని చుట్టూనే తిరిగెటోడు. మహబూబాబాద్‌లో తోటివాళ్లను వెంటేసుకొని ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. ఓ రోజు అమ్మా నేను హైదరాబాద్ వెళ్తున్న.. సినిమా పాటలు చేస్తా అంటే.. ‘మంచిది బిడ్డా.. వెళ్లు’ అని పంపించాను. అలా చక్రి సినిమా ప్రయాణం మొదలైంది. బాచి అనుకుంటా.. అదే వాడి ఫస్ట్ సినిమా! ఆ సినిమా పాటలు బయటకు వచ్చినరోజు చక్రి ఆనందానికి అడ్డుకట్టలేదు. దోస్తులను, దగ్గరోళ్లను అందరిని పిలుచుకొని నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఏ సినిమా ఓకే అయినా, రికార్డింగ్ స్టార్టయినా మొదట నా దగ్గరికి వచ్చి చెబుతూ.. చిన్నపిల్లాడిలా పొత్తిళ్లలో ఒదిగిపోయెటోడు.’’
ఆ దేవుడికి ఏం కోపమొచ్చిందో..!
‘‘అంతా బాగుంది.. నా బిడ్డ సినిమాలు చేసుకుంటున్నాడు.. నలుగురికి దారి చూపెడ్తున్నాడు అనుకుంటున్న సమయంలో ఆ దేవుడికి ఏం కోపమొచ్చిందో. నాకు కడుపు కోత మిగిల్చాడు. 40 ఏండ్ల వయసులోనే చక్రిని తీసుకెళ్లిపోయాడు. వాడు చనిపోయి 12 ఏండ్లయితున్నది. వాడిని అంత చిన్న వయసులో ఎలా తీసుకుపోవాలనిపించిందో ఆ దేవుడికి.. ఈ తల్లిని తీసుకపోయినా మంచిగుండేది. వాడు పోయినప్పటి నుంచి నా చిన్న కొడుకు మహిత్ నారాయణ్ తోటే ఉంటున్న. మహిత్‌కు చిన్నప్పుడే పోలియోతో కాళ్లు చచ్చుబడ్డాయి. కాళ్లు లేకపోయినా వాడూ అన్నలెక్కనే సంగీతం చుట్టూ తిరుగుతున్నడు.
నా కోసమే ఆ పాట పాడి..!
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో తల్లి మీద వస్తుంది ఓ పాట.. ‘‘నీవే నీవే నేనంటా..’’. ఆ పాట పాడే ముందు.. ‘‘అమ్మా ఈరోజు నీ పాట పాడుతున్ననే.. రికార్డింగ్‌కు వెళ్తున్న” అంటూ నా దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు వాడి కండ్లలో ఆనందాన్ని, కన్నీళ్లను దగ్గరుండి చూశాను. మీతో మాట్లాడుతుంటే ఇప్పటికీ ఆరోజే నా ముందున్నట్లు అనిపిస్తున్నది. వాడు మా అందరి నుంచి దూరమయ్యాక నాకంటూ మిగిల్చిన వాడి జ్ఞాపకం ఆ పాట ఒక్కటే! (కన్నీళ్లను ఆపుకుంటూ). నా చిన్నకొడుకు మహిత్ నారాయణ్ నా కోసమే రోజూ ఆ పాటను ప్లే చేస్తుంటాడు.
గద్దర్‌తో రికార్డింగ్ అయిపోగానే..!
‘‘నా కొడుకు తెలంగాణ బిడ్డ కాబట్టి.. వాడు ఏనాడూ ఈ మట్టిని మరవలేదు, ఇక్కడి జనాన్నీ మరువలేదు. తెలుగు సినిమాల్లో ముఖ్యంగా సంగీతంలో, పాటల్లో తెలంగాణ వాళ్లకు అవకాశాలు లేని సమయంలో వాడే చాలా మంది తెలంగాణ పిల్లలతో పాడించాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా నా బిడ్డ ఉన్నాడు. 2010లో తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పిల్లలు చనిపోతుంటే కన్నీళ్లు పెట్టుకునేవాడు. తెలంగాణ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. కనీసం సంగీతంతోనైనా ఉద్యమంలో తన పాత్ర ఉండాలనుకున్నాడు.
అలానే ‘జైబోలో తెలంగాణ’ సినిమాకు సంగీతం అందించాడు. నిజంగా ఆ టైమ్‌లో చాలా సినిమాలు వాడి చేతుల్లో ఉన్నాయి. కానీ, తెలంగాణ కోసం వస్తున్న సినిమా అని ముందుండి చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు వ్యతిరేకించినా వినలేదు. ప్రాణం పెట్టి పాటలు చేశాడు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ పాటను గద్దరన్నతో పాడిస్తున్నప్పడు వాడు ఎంతో పొంగిపోయాడు. ఆ పాటను రెండు రోజులు గద్దరన్నతో పాడించి.. అయిపోగానే, ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టేనమ్మా అంటూ సంబురపడ్డాడు. నా చిన్న కూతురు ఆదర్శినితో కూడా ఈ సినిమాలో ‘ఒకపువ్వు ఒక నవ్వు’ పాట పాడించాడు.’’
ముఖ్యమంత్రికి ఈ అమ్మ విన్నపం ఒక్కటే..!
నా కొడుకు చక్రి చనిపోయి పన్నెండేండ్లు దగ్గరపడుతున్నది. తెలంగాణ కోసం వాడు పాటలను పాడించాడు. గద్దర్ లాంటి పెద్దలతో కలిసి పనిచేశాడు. వాడు సంగీతం అందించిన ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..?’ పాట కావొచ్చు.. ‘జై బోలో తెలంగాణ.. నిలువెల్ల గాయాల వీణా” పాట కావొచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో మార్మోగింది. కానీ, నా బిడ్డ జ్ఞాపకమంటూ ఈ స్వరాష్ట్రంలో ఏదీ లేదు. పన్నెండేండ్లలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్నదీ లేదు. వంద సినిమాలకు సంగీతం అందించడం మాత్రమే కాదు. ఎవరూ ముందుకు రాని సమయంలో ‘జై బోలో తెలంగాణ’ లాంటి సినిమాకు సంగీతం అందించి పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకున్నాడు. వాడి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా.. ఈ తల్లి కోరిక తీరుస్తారని ఆశిస్తున్నా.
సినిమా వాళ్లకు ‘గద్దర్’ పేరు మీద రాష్ట్ర సర్కార్ అవార్డులు ఇస్తున్నది. చాలా మంచి విషయం. నా కొడుకు చక్రి పేరు కూడా ఓ అవార్డును పెట్టి.. పాటలు పాడేవాళ్లకు ఇస్తే ఎప్పటికీ వాడు అందరికీ యాదికుంటడు. చక్రి విగ్రహాన్ని కూడా హైదరాబాద్‌లో ఏదో ఒక చోట ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్న. దీనికోసం నేను ఎప్పుడూ ఎవరినీ అడుగలేదు.. నా దగ్గరికి కూడా ఎవరూ రాలేదు. నేను ఈ లోకం వదిలిపోయే సరికైనా నా కోరిక తీరుతుందో లేదు..! అని చక్రి తల్లి అన్నారు.

