ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాడుదాం: జేఏసీ చైర్మన్

కలం, ​కరీంనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర జేఏసీ (Employee JAC) పిలుపునిచ్చిన ‘చలో హైదరాబాద్’ (సెప్టెంబర్ 10) కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు “చలో హైదరాబాద్” గోడపత్రికను (పోస్టర్) ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సన్నాహకంగా సెప్టెంబర్ 8న కరీంనగర్‌లోని టీఎన్జీవోల కమ్యూనిటీ భవనంలో ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, గెజిటెడ్ అధికారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

హామీని తక్షణమే నెరవేర్చాలి..

నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో చిత్తశుద్ధి కొరవడింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి సీపీఎస్ (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలి’ అని డిమాండ్ చేశారు.

​భద్రత లేని పెట్టుబడుల ఉపసంహరణ..

ఉద్యోగుల భవిష్యత్తును షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు తాకట్టు పెట్టకూడదని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల వాటా పెన్షన్ నిధులను షేర్ మార్కెట్ నుంచి భద్రంగా వెనక్కి తీసుకురావాలన్నారు. పెన్షన్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదని, అది ఉద్యోగ విరమణ అనంతరం లభించే సామాజిక, ఆర్థిక భద్రత అని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) బకాయిలు, పీఆర్‌సీ (PRC) అమలుతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కోరారు.

​తాము ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ వ్యతిరేకం కాదని.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసే వారమే ఉద్యోగులమని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తాము ఎలాంటి అనుచిత కోరికలు కోరడం లేదని, రాజ్యాంగబద్ధంగా రావలసిన న్యాయమైన హక్కుల కోసమే పోరాడుతున్నామని తెలిపారు. ​అందువల్ల సెప్టెంబర్ 8న జరిగే జిల్లా సన్నాహక సమావేశానికి, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు విశేష సంఖ్యలో తరలివచ్చి హక్కుల సాధనకు ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>