కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్‌లోని (Mahbubnagar) పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) కీలక సూచనలు చేశారు. విద్యార్థులు అన్ని విషయాలలో పట్టు సాధించి, సమయపాలనతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని ఆమె అన్నారు. పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమం ఐదో రోజు ఘనంగా నిర్వహించబడింది. ఇందులో బుక్స్ ఎగ్జిబిషన్, ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం, విలేజ్ అడాప్షన్ అవగాహన కార్యక్రమం, రక్తదాన శిబిరం వంటి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదని, నియమితంగా హెల్త్ చెకప్‌లు చేయించుకుంటే వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. రక్తదానం మహత్తర సేవ అని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే బుక్స్ ఎగ్జిబిషన్, విలేజ్ అడాప్షన్, హెల్త్ క్యాంప్ వంటి కార్యక్రమాలు విద్యార్థులలో జ్ఞానం, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని ఆమె తెలిపారు.
అనంతరం పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి జి. ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులలో సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి డా. కే. ప్రవీణ, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

