కలం, వరంగల్ బ్యూరో: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు (DCP Prabhakar Rao) సూచించారు. శనివారం “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా కాజీపేట (Kazipet) ట్రాఫిక్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుబేదారి అదాలత్ సెంటర్‌లో హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో ఉన్న కానిస్టేబుళ్లు రహదారులపై ప్రచారం నిర్వహించారు. వాహనదారుల దృష్టిని ఆకర్షించి, హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశారు. ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా అదనపు డీసీపీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా క్షణాల్లో ప్రాణాలను కోల్పోయే ప్రమాదకర సంఘటనలు. వాటిని నివారించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తమ ప్రాణ రక్షణకు అత్యంత కీలకమని చెప్పారు. అలాగే కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే అరైవ్, అలైవ్ లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్నతో పాటు ఇతర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

