కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ లీక్ (TET Paper Leak) కేసులో భివాండీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిజేంద్ర కుమార్ గుప్తాను బిహార్‌లో పోలీసులు శనివారం ఉదయం విజయవంతంగా అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా తప్పించుకు తిరుగుతున్న గుప్తా కోసం మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
బిహార్‌లో పక్కా ప్లాన్‌తో దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న భివాండీ పోలీసులు, అక్కడ నుండి ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా మహారాష్ట్రకు తరలించారు. నిందితుడు బిజేంద్ర కుమార్ గుప్తాను మొదట విమానంలో పుణె విమానాశ్రయానికి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ నుండి తదుపరి విచారణతో పాటు కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు అతనిని భివాండీకి రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ టీఈటీ పేపర్ లీకేజీ ముఠా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో నిందితుడిని భివాండీ పోలీసులు ముమ్మరంగా విచారించనున్నారు.

