కలం, వెబ్ డెస్క్: స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలు, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై అసెంబ్లీ, శాసనమండలిలోనూ తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అంటూ శాసన సభను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ఈ మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన గాడితప్పిందని.. లా అండ్ ఆర్డర్ మంటగలిసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పై ప్రభుత్వ, పోలీసుల దౌర్జన్యంపై కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య అని.. దీనికి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని హరీశ్ రావు ఆగ్రహించారు. సభలో చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతాయని చర్చ జరగకుండా పథకం వేశారని ఆరోపించారు. ‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల తీర్పును మార్చలేవు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజల సమస్యలు తీర్చు’ అంటూ ఘాటుగా స్పందించారు.

