మట్టి విగ్రహాలతో కాలుష్యానికి చెక్.. కలెక్టర్ పిలుపు

కలం, వనపర్తి: వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రజలు మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని జిల్లా కలెక్టర్(Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14న జరగనున్న వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాలు పూర్తిగా పర్యావరణహితమైనవని తెలిపారు. నీటిలో త్వరగా కరిగిపోవడం వల్ల జల వనరుల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

త్వరలో 2 వేల మట్టి విగ్రహాల పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తరఫున జిల్లాకు 2 వేల మట్టి వినాయక విగ్రహాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు.

బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి

బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలనకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. బాల్య వివాహాల వల్ల తలెత్తే సామాజిక, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ బాలికలకు విద్య, భద్రత, సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త, నోడల్ అధికారి అనిల్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, కార్మిక శాఖ అధికారి రవి, డిసిపీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>