కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా బీజేపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న బీఫ్ కంపెనీలను వెంటనే రద్దు చేయాలని, విదేశాలకు బీఫ్ ఎగుమతులను నిషేధించాలని తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సామాజికవేత్త హనీఫ్ అహమ్మద్ (Mohammed Haneef Ahmed) డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బక్రీద్ కుర్బానీ నేపథ్యంలో పేద ముస్లింల ఆహార అలవాట్లు, మతాచారాలను అవహేళన చేస్తూ భౌతిక దాడులకు పాల్పడటం ఆందోళనకరమని అన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడితే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువులను వధించకూడదని బెంగాల్ ఉలేమాలు తీర్మానం చేయడం హర్షణీయమని, ఆ తీర్మానం దేశవ్యాప్తంగా అమలవ్వాలని ఆకాంక్షించారు. అదే విధంగా తెలంగాణ ముస్లిం మత పెద్దలు కూడా అనుకూల నిర్ణయం తీసుకోవడం సముచితమని పేర్కొన్నారు.
వ్యవసాయానికి పనికిరాని జీవాలను మాత్రమే కుర్బానీ కోసం ఉపయోగిస్తారని స్పష్టం చేసిన ఆయన, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పెయిడ్ వర్కర్స్ ద్వారా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి సామాజిక అశాంతికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంకుచిత మనస్తత్వాన్ని వీడి హిందూ–ముస్లిం సఖ్యతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా బీఫ్ కంపెనీలు విదేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయని పేర్కొన్న హనీఫ్ అహమ్మద్, పశుసంపద పరిరక్షణ కోసం బీఫ్ కంపెనీలను రద్దు చేసి ఎగుమతులపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో కొన్ని గోశాలల నుంచి పశువులను నేరుగా స్లాటర్ హౌస్‌లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి ఘటనలపై ప్రభుత్వం నిఘా పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనీఫ్ అహమ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు.

