కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలకు భూ సర్వేనే చక్కటి పరిష్కారమని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushbu Gupta) అన్నారు. జడ్చర్ల మండలం ఖానాపూర్‌లో రిసర్వే పనులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ కుష్బూ గుప్తా పరిశీలించారు. ముందుగా గ్రామంలో కొనసాగుతున్న భూముల రిసర్వే పనులను సంబంధించిన పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థులు రిసర్వే ప్రక్రియకు పూర్తిగా సహకరించాలని కోరారు. రిసర్వే ద్వారా భూముల వివరాలు, హద్దులు స్పష్టంగా నమోదవుతాయన్నారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలను నివారించేందుకు ఇది దోహదపడుతుందని ఆమె తెలిపారు. గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించాలని సూచించారు.
అనంతరం ఖానాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. గుడ్లు, ఇతర పౌష్టికాహారం విద్యార్థులకు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కుష్బూ గుప్తా అక్కడ విద్యుత్, లైటింగ్, ఫ్యాన్ల సమస్యలను గుర్తించారు. వాటిని వెంటనే మరమ్మతు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యుత్ కనెక్షన్ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. దీంతో సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని సర్పంచ్, గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్‌రావు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

