కలం, రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అధికారులను ఆదేశించారు. బుధవారం దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌లతో కలిసి ఆయన ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ తదితర పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు.
నిధుల కేటాయింపు:
ఆలయంలో ప్రస్తుతం రూ.76 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. కొత్తగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులకు టెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
నిరంతర పర్యవేక్షణ:
పనులను డే అండ్ నైట్ కొనసాగించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్, నెలకు ఒకసారి క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహిస్తామని విప్ శ్రీనివాస రావు తెలిపారు. వీటీఏడీఏ (VTADA) వైస్ ఛైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారని పేర్కొన్నారు.
పుష్కరాలకు నిధులు:
రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పర్యాటక ఆకర్షణ :
రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ వద్ద అభివృద్ధి చేసిన ప్రాంతానికి ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వేములవాడ రాజన్న ఆలయాన్ని అత్యున్నత ప్రమాణాలతో, దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

