విపక్షాలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఘాటు విమర్శలు

కలం, వనపర్తి: మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Megha Reddy) ప్రకటించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.2,389 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆరు గ్యారంటీల అమలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం 1000 రోజుల్లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజల ముందుంచుతామన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందో చెప్పేందుకు ప్రతిపక్షాలు సిద్ధమా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. “మా 1000 రోజుల అభివృద్ధి లెక్క ఇదిగో.. మీ పదేళ్ల లెక్క ఏమిటో చెప్పండి” అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు. అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేఎల్‌ఐపై ఎవరి వాటా ఎంత

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ వస్తున్న విమర్శలను ఎమ్మెల్యే మేఘారెడ్డి తిప్పికొట్టారు. మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి హయాంలో డీ–5, డీ–8, బుద్ధారం ప్రాంతాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పనులు జరిగాయని గుర్తు చేశారు. కర్నెతండా, బుద్ధారం, ఖిల్లాఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌ల ద్వారా సుమారు 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. గతంలో సుమారు 50 శాతం పనులు జరిగాయన్నారు.

మిగిలిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. 90 శాతం పనులు పూర్తయిన తర్వాత మిగిలిన పనులు చేసి మొత్తం ప్రాజెక్టును తామే పూర్తి చేశామని చెప్పుకోవడం విడ్డూరం కాదా? అంటూ ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తామే ప్రారంభించి పూర్తి చేశామని చెప్పుకోవడం రాజకీయ ప్రచారమేనని విమర్శించారు. గతంలో జరిగిన పనులకు ఇప్పుడు రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

‘నా డబ్బులు తిన్నానంటే.. వెంకటేశ్వరస్వామి గుడికి రండి’

తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపైనా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. “నేను కూలీని.. నా డబ్బులు పందికొక్కులు తిన్నాయో లేదో తేల్చుకుందాం. వెంకటేశ్వరస్వామి గుడికి రండి.. నేను వస్తా.. మీరు సిద్ధమా?” అంటూ సవాల్‌ విసిరారు. తాను భూమి కొనుగోలు చేసిన విషయం వాస్తవమేనని, ఆ వ్యవహారానికి జెడ్పీటీసీ రఘపతిరెడ్డి సాక్షిగా ఉన్నారని తెలిపారు. 39 గుంటల భూమిని ఎవరి పేరున రాసి ఇవ్వమన్నా ఇస్తానని పేర్కొన్నారు. ఈ అంశంపై రఘపతిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

‘వెలిగొండపై పదేళ్లలో ఏం చేశారు?’

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత పదేళ్లలో ప్రతిపక్షాలు ఏం చేశాయో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, వెలిగొండ, కేఎల్‌ఐ ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం రూ.182 కోట్లు చెల్లించిందని తెలిపారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

‘1000 రోజుల్లో 22 కోట్ల జీతాలు.. 22 రూపాయల పని చేశారా?’

బీఆర్‌ఎస్‌ పాలనపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “1000 రోజుల్లో 22 కోట్ల రూపాయల జీతాలు ఇచ్చాం.. 22 రూపాయల పని అయినా చేశారా?” అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గత పాలనలోని లోటుపాట్లను సరిచేస్తూనే 76 వేల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు.

పింఛన్ల విషయంలోనూ గత ప్రభుత్వాన్ని నిలదీశారు. పింఛన్‌ వయోపరిమితిని 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేని వారు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>