ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలకు కలెక్టర్ కీలక పిలుపు

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తప్పులు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎస్‌ఐఆర్ పురోగతి, గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను వివరించారు.

జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 79.62 శాతం డిజిటైజేషన్ పూర్తికాగా, మొత్తం ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, పరిశీలన పురోగతి 86.55 శాతానికి చేరిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడంతో ప్రజలకు ఫారాలు సమర్పించేందుకు అదనపు అవకాశం లభించిందన్నారు.

ఈఆర్వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగామన కల్పిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ఫీల్డ్ సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ అవసరమైన శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నామని చెప్పారు.పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 1,200 మందికి పైగా ఓటర్లు ఉంటే ప్రత్యామ్నాయ పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఆర్ఓ లకు సూచించినట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్ల స్థానాలు, ఒకే ప్రాంగణంలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

జిల్లాలో ఓటర్ల మొబైల్ నంబర్ల నవీకరణ పూర్తయిందని, వీఐపీ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సేకరించాలని ఈఆర్ఓలు, బీఎల్‌వోలకు సూచించినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారి ఫిర్యాదులను పరిశీలించి, ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారికి ఫారాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జాబితాలో పేరు లేని వారు ముసాయిదా ఓటరు జాబితా విడుదల అనంతరం ఫారం-6 ద్వారా ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

మరణించిన ఓటర్ల వివరాలను కుటుంబ సభ్యుల ధృవీకరణతో నమోదు చేసి, సంబంధిత ఫారాల ఆధారంగా మాత్రమే తొలగింపు ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. 85 సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలను కూడా మరోసారి క్షేత్రస్థాయిలో ధృవీకరించాలని బీఎల్‌వోలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారు మళ్లీ భౌతికంగా ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదని,బీఎల్‌వో లు కేవలం క్షేత్రస్థాయిలో వివరాలను ధృవీకరిస్తారని చెప్పారు. డూప్లికేట్ నమోదులను గుర్తించే సౌకర్యాన్ని బీఎల్‌వో లాగిన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చామని, పూర్తిస్థాయి విచారణ అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్ల తొలగింపు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఒకే ఇంటి నంబర్‌పై అధిక సంఖ్యలో దరఖాస్తులు, డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, కుటుంబ సభ్యులను ఒకే పోలింగ్ స్టేషన్‌లో కొనసాగించే విధానం, ఆగస్టు 3 తర్వాత చేపట్టే ప్రక్రియపై పలు సందేహాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లను నేరుగా తొలగించబోమని స్పష్టం చేశారు. సంబంధిత ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం మాత్రమే మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన, గుర్తించలేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశం ఎన్నికల జాబితాను ప్రక్షాళన చేయడమేనని, ఆగస్టు 3తో ప్రస్తుత ప్రక్రియ ముగిసిన తర్వాత ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.

అనుమానాస్పద నమోదులు, అసాధారణ దరఖాస్తులపై నోటీసులు జారీ చేసి ఆధారాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బీఎల్‌ఏలకు సూచనలు చేసి, క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, ఎన్నికల డి.టి. జాఫర్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>