కలం, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతిచిన్న అడవి పిల్లిగా పేరుగాంచిన రస్టీ-స్పాటెడ్ క్యాట్ మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్‌లో కెమెరా కంటికి చిక్కింది. కేవలం అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణంలో ఉండే ఈ అరుదైన పిల్లిని గుర్తించడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా సంయుక్తంగా ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన పులుల గణన సర్వే చేసింది. ఆ సమయంలో కెమెరా ట్రాప్‌లో ఈ పిల్లి ఫోటో నమోదైంది.
సుమారు 0.9 నుంచి 1.6 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ రస్టీ-స్పాటెడ్ పిల్లి, ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ‘నియర్ త్రెటెన్డ్’ (ప్రమాద అంచున ఉన్న జాతి)గా వర్గీకరించబడింది. సాధారణంగా దక్షిణ భారతదేశానికే పరిమితమని భావించే ఈ జాతి ఇప్పుడు మధ్య భారత్‌లో కూడా కనిపించడం వన్యప్రాణి ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్-1 కింద దీనికి అత్యున్నత స్థాయి రక్షణ కల్పించబడింది. ఈ పిల్లి ఉనికి ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.

