కలం, వెబ్ డెస్క్: బ్రెయిన్ స్ట్రోక్ పై అందరికీ అవగాహన అవసరమని.. ముందస్తు జాగ్రత్తలతో స్ట్రోక్ ను నివారించవచ్చని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud) అన్నారు. “ఇండియన్ సొసైటీ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్” ఆధ్వర్యంలో సరళా దేవి ఫౌండేషన్, గౌతమ్ న్యూరో కేర్, యుజీ డ్రీమ్స్ సహకారంతో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కోసం ‘5కే రన్’ ను హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. ఎంతోమంది యుక్త వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లకు గురవుతున్నారని చెప్పారు. అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనారోగ్యంతో ఆస్పత్రుల పాలై ఎంతోమంది అప్పుల పాలవుతున్నారన్నారు. ఒత్తిడిని నివారిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు, వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్ల వల్ల వాటిని నివారించవచ్చనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మెలగాలని సూచించారు. తరచూ హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 5కే రన్ విజేతలకు బహుమతులు, మెడల్స్ ను మధుయాష్కీ అందజేశారు.

