కలం, ఉట్నూర్: గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ గిరిజన సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ (Godam Nagesh), జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉట్నూర్ (Utnoor) లోని కేబీ కాంప్లెక్స్ హల్లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిరిజన గౌరవ దినోత్సవం’ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్-జంగల్-జమీన్ పరిరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
ఆయన జయంతిని జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించడం ద్వారా గిరిజన వీరుల త్యాగాలను దేశవ్యాప్తంగా స్మరించుకునే అవకాశం కలిగిందన్నారు. గిరిజన సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపారు. గిరిజన యువత విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్, డీడీ అశోక్, ఈఈ తనాజీ, డీఈఓ జి. చందన్, క్రీడల అధికారి పార్థసారథి, సందీప్, సిడం భీంరావు, దుర్గు పటేల్, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

