కలం, వెబ్ డెస్క్ : సొంత ఇల్లు అనేది సగటు మనిషికి ఒక కల. ఇల్లు కట్టుకునేటప్పుడు హోమ్ లోన్ (Home Loan) గురించే ఎక్కువ మంది వెతుకుంటారు. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందనేది చాలా మందికి తెలియక.. ఏదో ఒకటి తీసేసుకుంటారు. పైగా ఆ బ్యాంకు రూల్స్, టెన్యూర్ లాంటివి పెద్దగా అవగాహన లేక తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. తక్కువ వడ్డీకే లోన్ వచ్చే బ్యాంకులోనే అప్లై చేసుకుంటే బెటర్. గతేడాది రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో హోమ్ లోన్ (Home Loan) మీద వడ్డీ తక్కువగానే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభ వడ్డీ 7.10 శాతంగా ఉంది. ఒకవేళ రూ.35 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే 7.10 నుంచి 10.25 దాకా వడ్డీ పడుతుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోనూ 7.10 శాతం వడ్డీతోనే లోన్లు మొదలవుతున్నాయి. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల దాకా తీసుకుంటే అప్పుడు లోన్ పీరియడ్ ను బట్టి 7.15 శాతం నుంచి 9.25 శాతం దాకా వడ్డీ పడే ఛాన్స్ ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 7.10 శాతం నుంచి 9.90 శాతం దాకా వడ్డీ పడుతోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీలోనే కొంచెం తక్కువగా ఉంది. ఇందులో 7.90 శాతం నుంచే వడ్డీ ప్రారంభం అవుతోంది. అటు యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ లాంటి వాటిల్లోనూ 8.35 శాతం నుంచి ప్రారంభమై 9.75 శాతం దాకా వడ్డీ పడుతోంది. కాకపోతే ప్రైవేట్ బ్యాంకుల్లో చెక్ బౌన్స్ అయితే వేసే ఫైన్లు, అడిషనల్ వడ్డీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఈఎంఐ డేట్ కు ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా కట్టినా పెద్దగా ఫైన్లు ఉండవు.


