కలం, కరీంనగర్ బ్యూరో: ఆ యువకుడు ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరికి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ప్రియురాలు నేరుగా పెళ్లి మండపానికి చేరుకోవడంతో వివాహం మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి (Choppadandi) ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాలపల్లి గ్రామానికి చెందిన పిడుగు నరేష్(25) హనుమకొండకు చెందిన ఓ యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ దాదాపు 11 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉండగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది.
ఇటీవల తనను వివాహం చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయగా నరేష్ నిరాకరించినట్లు తెలిపింది. ఇదే సమయంలో చొప్పదండి మండలానికి చెందిన మరో యువతితో అతడి వివాహం జరుగుతున్న సమాచారం ప్రియురాలికి చేరింది. దీంతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు అంజలి కాదర్, పలువురు మహిళలు, పోలీసులతో కలిసి ఆమె నేరుగా పెళ్లి మండపానికి చేరుకుంది. పెళ్లి జరుగుతుండగా ప్రియురాలు అక్కడికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం వివాహాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై యువతి చొప్పదండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

