కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-44 (NH-44)పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి ఆలుగడ్డల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో మేడిపల్లి గ్రామం వద్ద రహదారి పక్కన నిలిపి ఉంచారు.
ఇదే సమయంలో అదిలాబాద్ నుంచి జొన్నల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. అదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన డ్రైవర్ జవారి సింగ్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ శ్రీనివాస్ సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

