చెర్వుగట్టు క్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం

కలం, నార్కట్‌పల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు (Cheruvugattu) శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద అర్ధరాత్రి వేళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొమ్మల దుకాణంలో ఒక్కసారిగా ప్రారంభమైన మంటలు క్షణాల్లో చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 17 శాశ్వత దుకాణాలు, 15 తోపుడు బండ్లు కాలి బూడిదయ్యాయి.

అర్ధరాత్రి వేళ గుట్ట కింద ఉన్న ఓ బొమ్మల షాపులో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇతర షాపులకు పాకాయి. షాపుల్లోని ప్లాస్టిక్, బొమ్మలు, ఇతర సామాగ్రి వల్ల మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు సమీపంలోని రెండు గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గుట్ట కింద ఉన్న స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయానికి కూడా మంటలు వ్యాపించాయి.

దీంతో ఆఫీసులోని పలు కీలకమైన దస్త్రాలు, రికార్డులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.అగ్నిమాపక శాఖకు చెందిన 3 ఫైర్‌ ఇంజిన్లు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగడం, ఆ సమయంలో దుకాణాల్లో వ్యాపారులు గానీ, భక్తులు గానీ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికులు అప్రమత్తమవ్వడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో చిరువ్యాపారులు తమ సర్వస్వాన్నీ కోల్పోయారు. సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రాథమికంగా వెల్లడించారు. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం, దేవస్థానం పాలకమండలి ఆదుకోవాలని భాధిత వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>