కోమటిరెడ్డి బ్రదర్స్ Vs సామేల్ : మరోసారి భగ్గుమన్న కాంగ్రెస్ వర్గపోరు

కలం, తిరుమలగిరి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరాయి. తిరుమలగిరి (Tirumalagiri) మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా మంత్రి కోమటిరెడ్డి వర్గానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలు తిరుమలగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం జరుగుతున్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ మద్దతుదారులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.

సమావేశాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి పరిస్థితి పరస్పరం తోపులాటలు, నెట్టుకోవడాల వరకు వెళ్లింది.

సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుమలగిరి ప్రాంతంలో ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ నేతలే రోడ్డుకెక్కి బహిరంగంగా ఘర్షణలకు దిగడం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>