కలం, వెబ్ డెస్క్: భూభారతి యాప్‌లో (Bhu Bharati) అక్రమాలు జరిగినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై లోకాయుక్త సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భూభారతి పోర్టల్‌ను అడ్డాగా చేసుకుని భారీ కుంభకోణం జరుగుతున్నట్లు ప్రాథమికంగా తేలడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ (CCLA), స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, పోలీసు ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్‌లకు లోకాయుక్త (Lokayukta) కీలక ఆదేశాలు జారీ చేసింది. భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
భూభారతి (Bhu Bharati) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీతో పాటు ఇతర ఛార్జీలను కాజేస్తున్న ముఠా పనిచేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్‌ను ఎడిట్ చేసి తక్కువ మొత్తంతో పేమెంట్ చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. జనగామ జిల్లాలో ఒక్క రోజే 10 చలాన్లకు సంబంధించిన రూ.8,55,577 మొత్తాన్ని దుండగులు కాజేసినట్లు అధికారులు గుర్తించారు.
చలాన్లలో తేడాలు ఉన్నాయన్న అనుమానంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా, జనగామ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో యాదాద్రి జిల్లాకు చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించారు.
ఈ భూభారతి కుంభకోణంలో CCLA టెక్నికల్ టీమ్‌కు చెందిన కొంతమంది సిబ్బంది సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, గత ప్రభుత్వ హాయంలో ధరణి స్లాట్ బుకింగ్ దశ నుంచే ఇలాంటి దందా జరుగుతోందన్న సమాచారం కూడా వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో భూభారతి వ్యవస్థలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్త ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: సంక్రాంతి ముగ్గులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి!
Follow Us On: Pinterest


