యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కలం, వెబ్ డెస్క్: యూపీఐ చెల్లింపులపై (UPI Payments) ఛార్జీలు విధించే ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు–2026’కు లోక్‌స‌భ‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ – 2007’ కు సవరణ చేశారు. అయోధ్య విరాళాల వివాదం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ వంటి ఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు గురువారం నిరసనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే వాయిస్ ఓట్ ద్వారా లోక్‌స‌భ‌ ఆమోదించింది.

బిల్లులో కీలక అంశాలు

– ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై జీరో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధానం అమల్లో ఉంది. అంటే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. ఈ బిల్లు ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు ఎండీఆర్ రుసుములను వసూలు చేసుకోవడానికి చట్టపరమైన అడ్డంకులను తొలగించారు.
– చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
– ఈ బిల్లులో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పన్ను నిబంధనలను సరళీకరించడంతో పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి పన్ను రాయితీల గడువును 2041 మార్చి 31 వరకు పొడిగించారు.
– రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులు పెట్టే చిన్న పెట్టుబడిదారులు, డేటా సెంటర్ల నిర్వహణలో ఉన్న క్లౌడ్ కంపెనీలకు కూడా పన్ను రాయితీ కల్పించారు.
– రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

డిజిటల్ బ్యాంక్ రికార్డులకు చట్టబద్ధత

రాజ్యసభలో ‘అప్రాప్రియేషన్ బిల్లు 2026’కు ఆమోదం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా చేసిన ఖర్చులకు ఈ బిల్లు ద్వారా చట్టబద్ధ అనుమతి లభించింది. అదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటాను కోర్టుల్లో అధికారిక సాక్ష్యాలుగా గుర్తించే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025’పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పించే గడువును లోక్‌స‌భ‌ పొడిగించింది. ఇదిలా ఉండగా, అయోధ్య విరాళాల వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసు చర్యపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఉభయ సభల్లో పలుమార్లు గందరగోళం నెలకొనగా, శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>