కలం, వెబ్ డెస్క్: రైతుల గుండెలు ఆగిపోయినా రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుండె కరగడం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలరోజులైనా ఇంత వరకు సంచులు కూడా ఇవ్వలేదని రైతులు చెబుతున్నారని అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే.. ధాన్యం కొనుగోలు నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎన్సాన్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి మాట్లాడారు.
రైతుకు సాయంగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారని ప్రశ్నించారు. మార్చి 22న 45 రోజుల్లోపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేస్తానని అన్నారని.. మార్చి 22, ఏప్రిల్ 22, మే 22 కూడా పోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ విడుదల చేసిన భరోసా నిధులు 2 ఎకరాలకే పడ్డాయి తప్ప మిగతా పైసలు పడలేదని అన్నారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఘాటుగా స్పందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది నోరా మోరా? అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam), ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారని దుయ్యబట్టారు. అంటే మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా? అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్, కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ రూముల్లో కూర్చుని డైలాగులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: హైదరాబాద్ మెట్రో రైల్‌కు భారీ రుణం
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

