కలం, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పీవీ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మహానేతగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు సేవలను కొనియాడారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ రాజకీయ నాయకుడు కే. కేశవరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పీవీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పీవీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
దూరదృష్టితో కీలక నిర్ణయాలు..
దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు దూరదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా, సంస్కరణల యుగానికి శ్రీకారం చుట్టిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. పరిపాలన, విదేశాంగం, విద్య, సాహిత్యం వంటి అనేక రంగాల్లో ఆయన ప్రతిభ అసాధారణమని రామచందర్ రావు పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఆశయాలు, విలువలు, దేశాభివృద్ధిపై ఆయనకు ఉన్న దృక్పథం నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

