Mobile Popup Ad
Mobile Popup Ad

హైవేపై కూలిన ప్రైవేట్ జెట్.. ఒకరి మృతి

కలం, వెబ్ డెస్క్ : టెక్సాస్‌లోని లారెడో నగరంలో ఒక ఘోర విమాన ప్రమాదం (Texas Plane Crash) చోటుచేసుకుంది. లాస్ కాబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లారెడో అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఒక ప్రైవేట్ జెట్ లారెడోలోని లూప్ 20 హైవేపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

మంటల్లో చిక్కుకున్న విమానం.. రెస్క్యూ ఆపరేషన్

సెసనా 680 సైటేషన్ లాటిట్యూడ్ (రిజిస్ట్రేషన్ సంఖ్య N523QS) రకానికి చెందిన ఈ చిన్న ప్రైవేట్ జెట్ విమానం ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు నియంత్రణ కోల్పోయి హైవేపై వెళ్తున్న ఒక పికప్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

కాపాడిన రక్షక సిబ్బంది..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం లోపల చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించడానికి వారు శతవిధాలా ప్రయత్నించారు. మంటలు వ్యాపిస్తున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా, కాక్‌పిట్ అద్దాలను పగలగొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీశారు. ఈ క్రమంలో దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ఐదుగురు పోలీస్ అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

స్తంభించిన ట్రాఫిక్.. దర్యాప్తు ప్రారంభం

ఈ ఘోర ప్రమాదం కారణంగా లూప్ 20 హైవే, సాండర్స్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు ఆ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. కాగా, ఈ విమాన ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>