కలం, వెబ్ డెస్క్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవీ (Rabri Devi)లకు ఇంతకాలం కొనసాగించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. వారి కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఇంతకాలం కొనసాగిన వై కేటగిరీ భద్రతను పూర్తిగా తొలగించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమావేశమై చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. రాజకీయ నాయకులకు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులకు కల్పించాల్సిన భద్రతపై 2010 నాటి సెక్యూరిటీ గైడ్‌లైన్స్ మేరకే ఈ మార్పులు చేసినట్లు ఆ ప్రభుత్వం పేర్కొన్నది. లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినందున వారికి ఇంతకాలం జెడ్ ప్లస్ భద్రత కొనసాగింది.
దీని ప్రకారం వారికి చెరి 40 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది, స్టాటిక్ గార్డులు, కమాండోలు, కాన్వాయ్.. ఇలాంటివన్నీ అమలయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వీరికి ఇక నుంచి 16 మంది చొప్పున మాత్రమే పోలీసు సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. ముగ్గురు సివిల్ డ్రెస్‌లో ఉండే సెక్యూరిటీ ఆఫీసర్లు, మరో ముగ్గురు యూనిఫామ్ గార్డులు, ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, ఒక పైలట్ వాహనం మాత్రమే ఉంటాయి. ప్రయాణించే సమయంలో మాత్రం వారికి ఎస్కార్ట్ టీమ్, పైలట్ వెహికల్ అదనంగా ఉంటాయి. తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఇంతకాలం ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించడంతో సాధారణ భద్రత మాత్రమే కొనసాగనున్నది. కేవలం ఒక బాడీగార్డు ఆయన వెంట ఉంటారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు కొనసాగుతున్న భద్రతే ఇకపైన కూడా కంటిన్యూ అవుతుంది.

