కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గానికి ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని (Kunamneni) సాంబశివరావు పేర్కొన్నారు. రైతుల కష్టాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుబాటులోకి వచ్చిన 22 కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో నూతనంగా మంజూరైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో కేంద్రాలను మంజూరు చేయించామని తెలిపారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అధికారులు, ఐకేపీ సిబ్బంది కొనుగోలు ప్రక్రియలో రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా తూకం విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, సరిపడ గోనె సంచులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజ ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తామని, దళారుల మాయమాటలు నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం విక్రయించిన అనంతరం రైతుల ఖాతాల్లోకి సకాలంలో నిధులు జమ అయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతు పక్షపాతిగా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఎంపీడీవో సుభాషిణి, తహసీల్దార్ నాగరాజు,ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

