కలం, వెబ్ డెస్క్ : పెట్రోల్ , డిజీల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలో కావాల్సిన ఇంధనం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ధరలు పెరుగుతాయనే వదంతుల నేపథ్యంలో ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు యత్నిస్తుండడంతో బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంటుందని చెప్పారు. వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రజలు ఆందోళన చెంది అవసరానికి మించి ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవడం వల్ల పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు వేలిసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు తెలిపారు. ఇంధన సరఫరాను సాధారణ స్థాయి కంటే 126 శాతం పెంచినట్లు ప్రకటించారు. ఇంధన సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అలాగే అంతరాష్ట్ర సరిహద్ధులో నిఘా ఉంచామన్నారు. అటు జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పిన మంత్రి ఉత్తమ్ .. వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

