సింగ‌రేణిలో కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి: కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: ​సింగరేణి (Singareni) యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని, పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) హెచ్చరించారు. కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆదివారం ప్రారంభమైన యూనియన్ కేంద్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల శ్రమతోనే సంస్థ మనుగడ సాగిస్తోందని, అలాంటి కార్మికులను యాజమాన్యం చిన్నచూపు చూడటం తగదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

​రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని కూనంనేని (Kunamneni) కోరారు. అలాగే నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్లర్క్ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు డిస్మిస్ అయిన కార్మికులకు ప్రత్యేక అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గత నెల గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడానికి సహకరించిన కార్మికులకు, నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

​అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని విమర్శించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరిగే యూనియన్ నాయకుడు కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, సెంట్రల్ సెక్రటరీలు వివిధ ఏరియాల బ్రాంచ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: నీ సంగతి చూస్తా.. కిషన్​ రెడ్డికి సీఎం వార్నింగ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>