కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కౌంటర్ ఇచ్చారు. కృష్ణా నది జలాల్లో 299 టీఎంసీలు చాలు అని కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీపై మరణశాసనం రాసింది మీరు కాదా? అని మండిపడ్డారు. అలాంటి హరిశ్ రావు తమ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకోబోమన్నారు. కృష్ణా జలాల అంశాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం భూముల పరిరక్షణతోపాటు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని స్పష్టం చేశారు.
భూ కబ్జాలను కవిత బయటపెట్టాలి..
బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి పాలనలో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులకు సంబంధించిన భూ కబ్జాలను కల్వకుంట్ల కవిత (Kavitha) బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. రాజకీయ ప్రాధాన్యం కోసం, తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఫైర్ అయ్యారు.
Read Also: నీ సంగతి చూస్తా.. కిషన్ రెడ్డికి సీఎం వార్నింగ్
Follow Us On : WhatsApp

