కలం, వెబ్ డెస్క్ : అభివృద్ధి పనులకు అడ్డంపడుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంగతి బరాబర్ చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రెంట్ , ఢిల్లీలో యుమునా రివర్ ఫ్రంట్ అభివృద్ది చేశారని.. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేయోద్దా..? అని సీఎం ప్రశ్నించారు.
గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలో మీటర్ల వరకు మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు పర్యాటక ప్రాంతం గా మారుతుందన్నారు. మూసీ మురికి కారణంగానే ఇక్కడ భూముల రేట్లు పెరగడం లేదని.. నల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని సీఎం (CM Revanth Reddy) చెప్పారు. ఆడబిడ్డలు కడుపుకోత కు గురౌతారని అక్కడి వాళ్లు బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారని రేవంత్ ఆరోపించారు.
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) 9 వ స్థానానికి పడిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. మెట్రో విస్తరణకు అన్ని అనుమతులు వచ్చాక కిషన్ రెడ్డి కాళ్లలో కట్టెలు పెట్టి ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లి.. మోదీని కలిశానని గుర్తు చేశారు. మెట్రో కు అనుమతులు, మూసీ రివర్ ఫ్రంట్ కి నిధులు తీసుకువచ్చే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా? అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందని.. మిగిలిన 25 లక్షలు ఎవరు కొనాలన్నారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కిషన్ రెడ్డికి ఉందన్నారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నవాళ్లు ఎవరూ బాగుపడలేదని.. 15 వ తేదీ తర్వాత బరాబర్ కిషన్ రెడ్డి సంగతి చెపుతాం అని రేవంత్ హెచ్చరించారు.
బీజేపీలో ఉండి వేరే పార్టీ వాళ్లతో కిషన్ రెడ్డి సహకారం తీసుకుంటున్నాడని ఆరోపించారు. అభివృద్ధి కోసం కలిసి వస్తానంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకుపోవడం లేదని విమర్శించారు. తుమ్మిడి హట్టి (Tummidihatti) బ్యారేజ్ నిర్మాణం పైన చర్చించడానికి ముందుకు రాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకుని తిరుగేందుకు కారణం కిషన్ రెడ్డి అని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ టూ లో మూసీ ప్రక్షాళన చేస్తామని.. వంద రోజుల్లో కార్యాచరణ ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: విపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
Follow Us On : WhatsApp

