కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సంధించారు. ముఖ్యంగా బుద్వేల్ నుంచి కొడంగల్‌కు తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణం గురించి ప్రశ్నించారు. రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్ల టెండర్లలో అవకతవకల నేపథ్యంలో వెంటనే వాటిని రద్దుచేయాని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాకు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినా, టెండర్లు ఎందుకు కట్టబెట్టారో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలనతో ప్రజలను భయభ్రాంతులకు విమర్శించారు. అక్రమ నిర్మాణాల పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడం, సరైన పునరావాసం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి కార్యక్రమాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అభివృద్ధి పేరుతో పేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని అన్నారు. ప్రజలకు నష్టం కలగకుండా, పారదర్శకతతో కూడిన విధానాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు సంబంధించిన విధానాలపైనా కేటీఆర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనతో హైదరాబాద్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటోందని, నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన, హైడ్రా చర్యలు, ఇతర ప్రాజెక్టుల వ్యయాలపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కేటీఆర్ కోరారు. భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టుల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో స్పష్టం చేయాలని అన్నారు. పునరావాసం, పరిహారం, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో స్పష్టమైన విధివిధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, వారి ఇళ్లు, ఆస్తులపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

