వివేకానంద విద్యానికేతన్ యాజమాన్యంపై చర్యలకు AIYF డిమాండ్

కలం, కరీంనగర్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను (Private School Buses) నడుపుతున్న వివేకానంద విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) జిల్లా ప్రధాన కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల రవాణా కోసం కేటాయించిన స్కూల్ బస్సులను, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు తిప్పడం రవాణా శాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు.

స్కూల్ బస్సుల రవాణా నిబంధనలను వివేకానంద విద్యానికేతన్ యాజమాన్యం బొందపెట్టిందని మండిపడ్డారు. రవాణా శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న వివేకానంద విద్యానికేతన్ స్కూల్ బస్సులను సమగ్రంగా తనిఖీ చేయాలని అన్నారు. ​పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న బస్సులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.​మోటారు వాహనాల చట్టం ప్రకారం వివేకానంద స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల విద్యార్థుల భద్రతతో పాటు, రవాణా నిబంధనలకు తీవ్ర విఘాతం కలుగుతోందని యుగంధర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి వివేకానంద స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే AIYF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>