కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. అకాల వర్షాలు (Untimely Rains), ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు (Telangana Farmers) కన్నీరుమున్నీరు అవుతున్నారని చెప్పారు.
ముందుచూపు లేకపోవడం ఈ దుస్థితిని..
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే ధాన్యం నీళ్లపాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ తమ పరిధిలో అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.
తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలి..
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని చెప్పారు. తడిసిన ధాన్యానికి తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు (MSP) ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను ప్రభుత్వం తక్షణమే అందుబాటులో ఉంచాలని కోరారు. పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు.

