కలం, వెబ్ డెస్క్ : డబ్బుపై వ్యామోహం, ఒకరితో ఏర్పడిన అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్మును దక్కించుకోవడానికి ఒక భార్య, తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో కలకలం రేపింది. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సాయిని కుమార్ (40) అనే వ్యక్తికి భారతి అనే మహిళతో వివాహం జరిగింది. అయితే, గత కొన్నేళ్లుగా లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో భారతి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను వదిలించుకోవాలని ఆమె పథకం వేసింది. పైగా అతను చనిపోతే భారీగా డబ్బు వస్తుందనే దురాశతో, ఏడాది క్రితమే భర్త పేరిట మూడు కోట్ల రూపాయల జీవిత బీమా చేయించింది.
హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు సులువుగా వస్తాయని భావించిన భారతి, తన భర్తతో పాత వివాదాలు ఉన్న రామ్ మల్లేశ్ అనే వ్యక్తిని ఆశ్రయించింది. అతనికి సుపారీ ఇచ్చి భర్తను చంపేందుకు డీల్ కుదుర్చుకుంది. పథకం ప్రకారం ఈ నెల 22వ తేదీన రామ్ మల్లేశ్, అతని స్నేహితుడు శ్రీరామ్ కుమార్ కలిసి మద్యం తాగుదామంటూ సాయిని కుమార్‌ను పిలిచారు. అనంతరం సాయిని కుమార్ తలపై ఇనుప సుత్తితో బలంగా దాడి చేసి చంపేశారు. అనంతరం ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించేలా చేయడానికి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు.
మొదట దీనిని రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణలో అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెక్నికల్ ఆధారాలు, భార్య ప్రవర్తనను పరిశీలించిన పోలీసులు అసలు నిజాన్ని బయటకు తీశారు. వివాహేతర సంబంధం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ దారుణ హత్య జరిగినట్లు గుర్తించారు. నిందితులు భారతి, ప్రియుడు సురేందర్, సుపారీ గ్యాంగ్ సభ్యులు రామ్ మల్లేశ్, శ్రీరామ్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

